బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన ఓ నిర్మాతకు, ఆయన కుమార్తెలకు కరోనా వచ్చింది. అలాగే ఓ బాలీవుడ్ గాయనికి సైతం కరోనా వచ్చింది. ఇప్పుడు... తాజాగా మరో నటుడి ఇంట్లో కరోనా వైరస్ వ్యాపించింది. ప్రస్థానం ఫేమ్ బాలీవుడ్ యాక్టర్ సత్యజిత్ దూబే తల్లి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సత్యజిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 

 ‘‘తీవ్రమైన తలనొప్పి, జ్వరం అమ్మను వేధించాయి. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తనను ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. తను మహమ్మారితో ధైర్యంగా పోరాడి తిరిగి వస్తుంది. అయితే ప్రస్తుతానికి నాలో, నా సోదరిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనపడటం లేదు. అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. రోజూ అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాం. డాక్టర్లు, నర్సులు తనను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు.
 
 ప్రస్తుతం తన తల్లికి నానావతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామన్నారు.ఈ కష్ట కాలంలో మాకు అండగా నిలిచిన ఇరుగుపొరుగు వాళ్లు, స్నేహితులు, కరోనా యోధులు, బీఎంసీ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకెంతో అవసరం అని సత్యజిత్‌ పేర్కొన్నాడు. 

మహమ్మారి ఇలా అన్ని వర్గాలను ఒక్కటి చేస్తుందని, ఒకరి బాధను మరొకరు పంచుకునేలా చేస్తుందని తానెన్నడూ ఊహించలేదని ఎమోషన్ గా అన్నారు. ఇక తన తల్లి నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినపుడు మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్  వంటి నిబంధనలు పాటించిందని.. అయినప్పటికీ తనకు వైరస్‌ ఎలా సోకిందో అర్థం కావడం లేదని వాపోయాడు. 

 ఆల్వేస్‌ కభీ కభీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సత్యజిత్..‌. బాంకే కీ క్రేజీ బరాత్‌, కెర్రీ ఆన్‌ కటాన్‌, లవ్‌ ఆన్‌ ది రాక్స్‌- టేబుల్‌ ఫర్‌ టూ తదితర చిత్రాల్లో నటించాడు. చివరగా ‘ప్రస్థానం’ సినిమాలో సంజయ్‌ దత్‌, మనీషా కొయిరాలా, అలీ ఫజల్‌తో కలిసి నటించారు. మన తెలుగు దర్శకుడు దేవకట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.