నటుడు శరత్ బాబు ఆరోగ్యం మీద వస్తున్న కథనాల విషయంలో కుటుంబ సభ్యులు చర్యలకు సిద్ధమయ్యారు. వెంటనే వీడియోలు తొలగించాలని హెచ్చరించారు.
కొద్దిరోజులుగా నటుడు శరత్ బాబు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక దశలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని సమాచారం. ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం ఆయన కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. చిత్ర వర్గాలు సైతం సంతాపం తెలుపుతూ పోస్ట్స్ పెట్టారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. శరత్ బాబు కోలుకుంటున్నారు. ఐసీయూ నుండి ఆయన్ని జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. నిరాధార వార్తలు ప్రచారం చేయవద్దని ప్రకటన విడుదల చేశారు.
అయినప్పటికీ శరత్ బాబు ఆరోగ్యం మీద కథనాలు ఆగలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శరత్ బాబు హెల్త్ కండిషన్ ని ఉద్దేశిస్తూ ప్రసారం చేస్తున్న వీడియోలు యూట్యూబ్ ఛానల్స్ నుండి తొలగించాలని కోరారు. లేని పక్షంలో సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇకపై ఎలాంటి వదంతులు ప్రచారం చేసినా సహించేది లేదన్నారు.
శరత్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో ఆయన సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆయన నటించిన మొదటి చిత్రం రామ రాజ్యం. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. ఐదు దశాబ్దాల కెరీర్లో శరత్ బాబు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆయన చివరిగా కనిపించిన తెలుగు చిత్రం వకీల్ సాబ్.
శరత్ బాబు 1974లో లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. 1988లో విబేధాలతో ఆమెతో విడిపోయారు. అనంతరం 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసకొని విడిపోయారు.
