ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలైన సినీ నటుడు భరత్ తన సోదరుడి అంత్య క్రియలకు హాజరు కాని హీరో రవితేజ హాజరు కాకపోవడానికి కారణం వేరని వివరణ ఇచ్చే ప్రయత్నంచేసిన రవితేజ

హీరో రవితేజ తమ్ముడు భరత్‌ కారు ప్రమాదంలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. దారుణం ఏంటంటే భరత్‌ అంత్యక్రియలు ఒక అనాధకు జరిగినట్లుగా జరిగాయి. కనీసం తల్లి, తండ్రి, అన్న ఏ ఒక్కరు కూడా భరత్‌ మృతదేహం చూసేందుకు రాలేదు. మరీ పాపులర్ కాకున్నా భరత్ అసలు గుర్తింపు లేని నటుడేం కాదు, హీరోగా కూడా చేసాడు. అలాంటి భరత్ కి అలా అనామకుడిలా తుది వీడ్కోలు జరగటం చాలామందినే బాదించింది.

దాంతో రవితేజపై తీవ్రమైన విమర్శలు వ్యక్తం అయ్యాయి. అంతా ఉన్నా కూడా ఒక అనాధలా ఎందుకు భరత్‌ను వదిలేశారు? అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఆ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్న చేసాడు రవితేజా... అన్నిటికీ మించి భరత్ అంత్య క్రియలు చేసింది ఎవరో కాదు తన బాబాయ్ అంటూ ఇప్పటివరకూ ఉన్న విమర్శలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసాడు. నిందలు వేశారు తన మీద అకారణంగా నిందలు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రవితేజ. ఏది పడితే అది రాసేయడం చాలా బాధాకరమని.. తన మీద పడ్డ నిందలకు సమాధానం చెప్పే స్థితిలో కూడా తాను లేనని రవితేజ చెప్పాడు.

తమ్ముడి ముఖం ఛిద్రమైందని తెలిసి.. అది చూసి తట్టుకునే శక్తి లేకే తాను కడసారి చూపుకు రాలేదని రవితేజ చెప్పాడు. సోషల్ మీడియాలో కానీ.. టీవీలో కానీ భరత్ యాక్సిడెంట్ ఫొటోలను తనతో పాటు తన తల్లిదండ్రులూ చూడలేదని.. తాము చూడలేమని.. భరత్ మా ఊహల్లో ‘హ్యాపీ'గా నిలిచిపోయాడని.. ఎప్పుడూ తమకు అలాగే గుర్తుండిపోవాలనుకునే అతణ్ని చూడటానికి రాలేదని రవితేజ చెప్పాడు.

మామూలుగా తనకు తెలిసిన వారు ఎవరు మరణించినా వారి భౌతిక కాయాన్ని చూడటానికి తను వెళ్లనని చెప్పిన రవి తేజ, అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళతాను తప్ప ప్రాణంలేని మనిషిని తను చూడలేనని అని రవితేజ తన తత్వాన్ని వివరించాడు. గతంలో హీరో శ్రీహరి భౌతికకాయాన్ని మాత్రం చూశానని.. అప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని రవితేజ అన్నాడు. శ్రీహరిని అలా చూసి తట్టుకోలేకపోయానని.. ఇంటికి చేరుకునే సరికి తీవ్రమైన గుండెదడ, భయం అనిపించిందని.. దీంతో మళ్లీ చనిపోయినవారిని చూసే సాహసం చేయడం లేదని రవితేజ వ్యాఖ్యానించాడు. అలాంటి తను తమ్ముడి శవాన్ని ఎలా చూడగలను అని రవితేజ ఆవేదనతో ప్రశ్నించాడు. అందుకే భరత్ అంత్యక్రియలకు రాలేకపోయానని అన్నాడు.

భరత్ చనిపోయిన రోజు తమ కుటుంబం పరిస్థితి గురించి వివరిస్తూ.. ‘‘భరత్ యాక్సిడెంట్ లో చనిపోయాడనే వార్త తెలిసి మా కుటుంబం షాకైంది. మా నాన్నగారి వయసు 85 ఏళ్ల పైనే. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రమే. ఈ వార్త విన్న తర్వాత ఏదోలా అయిపోయారు. అమ్మ కుప్పకూలిపోయింది. నాన్న పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే అనిపించింది. నేను అమ్మా నాన్నల్ని చూసుకుంటూ తమ్ముడు రఘును ఆసుపత్రికి పంపించాను. భరత్ ముఖానికి బలమైన గాయాలు తగిలాయని తెలిసి.. మేం వాడిని అలా చూడకూడదనుకున్నాం.

మా తమ్ముడి అంత్యక్రియల్ని ఎవరో జూనియర్ ఆర్టిస్టుతో చేయించారని రాశారు. కానీ .. నేను మా అమ్మానాన్నల దగ్గరుండిపోయా. రఘుతో చేయించకూడదన్నారు. అందుకని మా బాబాయితో అంత్యక్రియలు చేయించాం. ఇదీ వాస్తవం'' అని రవితేజ వివరించాడు.