విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. భర్త కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ పోషించాడు. కథ ప్రకారం అమ్మాయిలను వేధించే సైకిక్ క్యారెక్టర్ అది.

సినిమా క్లైమాక్స్ లో అర్జున్ ను హీరోయిన్ రష్మిక కొడుతుంది. ఆమె అలా కొట్టినప్పుడు తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెబుతున్నాడు నటుడు రాజ్ అర్జున్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పందించారు. సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ మీ మీద చేయి చేసుకున్నప్పుడు  మీరేం అనుకున్నారని ప్రశ్నించగా.. తాను చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పారు. 

ఎందుకంటే సినిమాలో కొన్ని సీన్స్ లో రష్మికని బాగా ఇబ్బంది పెట్టానని.. ఆమెను చాలా టార్చర్ చేశానని అన్నారు. నటనలో భాగంగా మెంటల్ గా, ఫిజికల్ గా తనను ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని.. సీన్ అయిపోయిన తరువాత కూడా రష్మిక ఏడ్చేదని.. దీంతో ఆమె దగ్గరకి వెళ్లి చాలా సేపు మాట్లాడేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ అర్జున్. కేవలం సీన్స్ కోసమే అలా చేశానని..క్షమించమని, బాధపడవద్దని చెప్పేవాణ్ని అంటూ గుర్తుచేసుకున్నారు. 

చివరకు తనను కొట్టినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయినట్లు.. తన కోపం తగ్గి ఉంటుందని రాజ్ అర్జున్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో విజయ్, రష్మికలతో మంచి స్నేహం ఏర్పడిందని అన్నారు.