బెంగుళూరులో విషాదం చోటు చేసుకుంది. నటుడు నాగభూషణ తన కారుతో ఫుట్ పాత్ పై సంచరిస్తున్న జంటను ఢీ కొట్టాడు. మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
కన్నడ నటుడు నాగభూషణ కారణంగా ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాగభూషణ ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళుతున్న భార్యభర్తలను తన కారుతో గుద్దారు. బెంగుళూరు నగరంలో గల వసంత నగర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి 9:45 నిమిషాల ప్రాంతంలో నాగభూషణ ఉత్తరాహాల్ ప్రాంతం నుండి కోననకంటే వైపు కారులో వేగంగా వెళుతున్నాడు. కారు అదుపు తప్పడంతో విద్యుత్ పోల్ ని గుద్దాడు. అనంతరం ఇద్దరు వ్యక్తుల మీదకు దూసుకుపోయాడు.
ప్రమాదానికి గురైన వ్యక్తులు భార్యాభర్తలు అని తెలుస్తుంది. 48 ఏళ్ల మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. 58 ఏళ్ల ఆమె భర్త చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం అని పోలీసులు తెలియజేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ లో మద్యం సేవించిన ఆనవాళ్లు ఏమీ లేవని అధికారులు అభిప్రాయ పడ్డారు. నాగభూషణం రక్త నమూనాలు పరీక్షలకు పంపామని ట్రాఫిక్ డీసీపీ శివ ప్రకాష్ తెలియజేశారు.
బాధితులను నాగభూషణం స్వయంగా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. తెలుగులో నాగభూషణ యూ టర్న్ చిత్రంలో నటించారు. సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు చేయగా ఆటో డ్రైవర్ రోల్ చేశాడు. ఇటీవల కౌశల్య సుప్రజ రామ చిత్రంలో నటించాడు. నాగభూషణ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
