కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అరుదైన బహుమతి పంపారు. ఆ గిఫ్ట్ తో పాటు పోజిచ్చిన చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కొంచెం అటూఇటుగా ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు చిరంజీవి మరియు మోహన్ బాబు. 1974లో కన్నవారి కలలు చిత్రంతో నటుడిగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. 1978లో చిరంజీవి నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదల అయ్యింది. విలక్షణ నటుడిగా ముఖ్యంగా విలన్ రోల్స్ తో మోహన్ బాబు ఫేమస్ అయ్యారు. ఇక చిరు మొదటి నుండి హీరోగానే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా చేశారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు హీరోగా టర్న్ అయ్యారు. చిరంజీవి సినిమాలలో కూడా మోహన్ బాబు విలన్ గా చేశారు.
ఇక అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఎవరికీ అందనంత ఇమేజ్, స్టార్ డమ్ తెచ్చుకొని టాలీవుడ్ నంబర్ వన్ అయ్యారు. ఎవరి చూపైనా నంబర్ వన్ పైనే ఉంటుంది. అందుకే 500 పైగా చిత్రాలలో నటించినా, బ్లాక్ బస్టర్స్ కొట్టినా మోహన్ బాబుకు చిరంజీవి అంత గుర్తింపు రాలేదు. ఐతే మోహన్ బాబు ఇది ఒప్పుకోరు. ఎవరైనా నా తరువాతే అంటారు. అందుకే కొన్ని సంఘటనల వలన చిరంజీవి మరియు మోహన్ బాబుకు విభేదాలు రావడం జరిగింది.
చాలా కాలం వీరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కారణం ఏదైనా కానీ సడన్ గా ఒక్కటైపోయారు. అది కూడా ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకొనేంతలా. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఒకరిని మరొకరు అభినందిచుకుకోవడంతో పాటు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఇక నిన్న మెగాస్టార్ పుట్టినరోజు నేపథ్యంలో మోహన్ బాబు ఓ అరుదైన బహుమతి పంపారు. ఒక వుడెన్ బైక్ ని ఆయన పంపించడం జరిగింది. దానికి చిరంజీవి 'నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి' అని ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
