దేశమంతా భారీ వర్షాల కారణంగా వరదలు భయపెడుతున్నాయి. వరదల్లో ఎంతో మంది చిక్కకుని మరణిస్తున్నారు. ఈక్రమంలో సౌత్ స్టార్ హీరో ఉత్తరాది వరదల్లో చిక్కకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వరుస వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో కుండపోత వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. రవాణా మార్గాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ఆర్. మాధవన్ జమ్మూకాశ్మీర్‌లోని లేహ్‌లో వరదల కారణంగా చిక్కుకున్నట్లు స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా మాధవన్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. "17 సంవత్సరాల తర్వాత మరోసారి లేహ్‌లో వర్షాల కారణంగా చిక్కుకున్నాను," అని ఆయన పేర్కొన్నారు. “గతంలో ‘త్రీ ఇడియట్స్’ సినిమా షూటింగ్ కోసం లేహ్‌కి వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షాల కారణంగా ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు మరోసారి అదే అనుభవాన్ని ఎదుర్కొంటున్నాను,” అని మాధవన్ తన పోస్ట్‌లో వెల్లడించారు.
మాధవన్ ప్రస్తుతం లేహ్‌లో ఉన్న పరిస్థితిపై కూడా వివరించారు. "ఇది ఎంతో అందమైన ప్రదేశం. కానీ, వర్షాల కారణంగా విమానాలు నిలిచిపోయాయి. బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. " అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న అభిమానులు ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మాధవన్ త్వరగా సురక్షితంగా బయటపడాలని అభిలషిస్తున్నారు.
లేహ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, విమాన సర్వీసులు నిలిచిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులు, స్థానికులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు వెలువడుతున్నాయి.
మాధవన్ ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 55 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. హీరోగా దూసుకుపోతున్నాడు. మాధవన్ మాత్రమే కాదు ఆయన తనయుడు కూడా స్పోర్డ్స్ లో రాణిస్తున్నాడు. ఇప్టటికే ఎన్నో మెడల్స్ కూడా తీసుకువచ్చి తండ్రి పేరు నిలబెడుతున్నాడు. ఇక వ్యక్తిగత పర్యటనకోసం లేహ్ కు వెళ్ళిన మాధవన్ అక్కడ వరదల్లో చిక్కుకుపోయారు. "ఇది ఒక అందమైన ప్రదేశం అయినప్పటికీ, ప్రకృతి శక్తి ముందు మనం చాలా చిన్నవాళ్లం," అంటూ మాధవన్ సోషల్ మీడియా ద్వారా సందేశమిచ్చారు.
