నటుడు నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారని సమాచారం.  

నటుడు బండ్ల గణేష్ బుధవారం ప్రొద్దుటూరు కోర్టులో ప్రత్యక్షమయ్యారు. చెక్ బౌన్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండ్ల గణేష్ కోర్టు వాయిదాకు హాజరైనట్లు కోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. ఈ కేసును జడ్జి ఫిబ్రవరి 22కి వాయిదా వేశారట. విచారణ ముగిసిన అనంతరం బండ్ల గణేష్ అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. 

బండ్ల గణేష్ నటుడిగా పరిశ్రమలో అడుగు పెట్టారు. పలు చిత్రాల్లో కమెడియన్, హీరో ఫ్రెండ్ పాత్రలు చేశారు. శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ స్థాపించి 2009లో ఆంజనేయులు మూవీ చేశారు. రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు అనుకున్నంతగా ఆడలేదు. పవన్ కళ్యాణ్ కి దగ్గరై తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు నిర్మించారు. తీన్ మార్ నష్టాలు మిగల్చగా... గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 

ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నిర్మాత బండ్ల నేను అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ చర్చకు దారితీశాయి. బండ్ల గణేష్ ఎన్టీఆర్ తో కూడా రెండు సినిమాలు చేశారు. బాద్ షా, టెంపర్ చిత్రాలు తెరకెక్కించారు. టెంపర్ తర్వాత ఆయన మరో మూవీ నిర్మించలేదు.

ఆయన ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ టైటిల్ తో తమిళ్ రీమేక్ చేశారు. అలాగే మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా మూవీలో నటించాడు. సరిలేరు నీకెవ్వరు మూవీలో కామెడీ రోల్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. రోజూ ట్వీట్స్ వేస్తూ ఉంటారు. ఆయన పోస్ట్స్ పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తునట్లు ఉంటాయి.