‘కోహ్లీ నన్ను చావకొట్టాడు’

Actor Armaan Kohli Booked For Physically Assaulting Live-In Partner
Highlights

కోహ్లీపై పోలీసు కేసు

కోహ్లీ తనను దారుణంగా కొట్టాడని.. అతని కారణంగానే తాను ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నట్లు ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ నీరూ రాంధవా తెలిపారు. కోహ్లీ అంటే.. స్టార్ క్రికెటర్  విరాట్ కోహ్లీ అనుకునేరు. కాదండి.. బాలీవుడ్ వివాదాస్పద నటుడు, బిగ్ బాస్ మాజీ పోటీదారుడు అర్మాన్ కోహ్లీ. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్టైలిస్ట్‌ నీరూ, నటుడు అర్మాన్‌ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. 

అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదు. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. కాగా, కోహ్లి అప్పటికే అజ్ఞాతంలోకి పారిపోయాడు.  ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

బాలీవుడ్‌లో 70,80వ దశకాల్లో ‘నాగిన్‌’, ‘జానీ దుష్మన్‌’, ‘రాజ్‌ తిలక్‌’, లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్‌ కోహ్లి తనయుడే అర్మాన్‌ కోహ్లి. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రాజ్‌కుమార్‌ మిన్నకుండిపోయారు. 

మొదట్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగిన అర్మాన్‌.. బిగ్‌బాస్‌ షోతో ఒక్కసారే బడా సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్‌బాస్‌-7 షో జరుగుతుండగానే కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో అర్మాన్‌ రొమాన్స్‌ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో పెనుదుమారం రేపింది.

loader