బ్రో చిత్రంలో శ్యాంబాబు పాత్రపై రచ్చ.. అంబటి ఆస్కార్ నటుడేం కాదని పృథ్వీ సెటైర్లు..
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘‘బ్రో’’. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి రాగా.. ఇందులో శ్యాంబాబు పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘‘బ్రో’’. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి రాగా.. ఇందులో శ్యాంబాబు పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిత్రంలో శ్యాంబాబు పాత్రను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించారు. అయితే ఈ పాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తుంది. పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు వేసిన విధంగానే నటుడు పృథ్వీతో డ్యాన్స్ చేయించినట్టుగా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ కూడా పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన డ్యాన్స్ సింక్ అవ్వడానికి తానేమైనా డ్యాన్స్ మాస్టర్‌నా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు సింక్ అవ్వవని అన్నారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని, ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ చేయనని అన్నారు. పవన్ కల్యాణ్‌ది శునకానందం అని విమర్శించారు.
అయితే ఈ దుమారం నేపథ్యంలో శ్యాంబాబు పాత్ర పోషించిన పృథ్వీ స్పందిస్తూ.. అంబటి రాంబాబును ఇమిటేట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అంబటి ఆస్కార్ నటుడేం కాదని సెటైర్లు వేశారు. తనకు ఇచ్చిన పాత్రనే చేశానని చెప్పారు. బ్రో చిత్రంలో బాధ్యత లేని వ్యక్తి పాత్ర తనదని తెలిపారు. తన పాత్ర డ్యాన్స్ అలా ఉందని ఆయన అనుకుంటున్నారేమోనని.. తాము అనుకోవడం లేదని అన్నారు. అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. జనసేన శ్రేణులు కూడా ఈ వాదనను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఆయన తమకన్నాగొప్పగా తమ డ్యాన్స్ వేరని, అంబటి రాంబాబు డ్యాన్స్ వేరని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రులను కించపరుస్తున్నారని మాట్లాడుతున్నారని.. పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఎలాంటి భాష వాడారని ప్రశ్నించారు.