నటి, జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే రోజాని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కలిశారు. కుటుంబ సమేతంగా రోజా నివాసంలో వారిని కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని  స్నేహితురాలైన రోజాని, ఆమె భర్త, దర్శకుడు సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్‌ వెంట ఆయన భార్య నివేదిత, కుమార్తెలు, నటి ఐశ్వర్య, అంజనాల ఉన్నారు. 

 అనంతరం హీరో అర్జన్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి వారికి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలుపల అర్జున్‌ను చూడటానికి, పొటోలు తీసుకోడానికి భక్తులు, అభిమానులు ఉత్సహం చూపారు.  ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నారు అర్జున్‌. మూడేళ్ల క్రితం అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా`లో కీలక పాత్రలో నటించారు అర్జున్‌. ఇప్పుడు `జనగణమన`,  `ఫ్రెండ్‌షిప్‌`, `మేధావి` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.