సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. 

ఈ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను అనుకున్నదానికంటే కాస్త ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి సినిమా ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు. అందుకే పెద్దగా పోటీ సమయంలో రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు దొరకడంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయని అనుకుంటున్నారు. 

మార్చి 22న ఈ సినిమాతో పాటు అల్లు శిరీష్ 'ఏబీసీడీ', 'ప్రేమ కథా చిత్రమ్ 2' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను కాస్త ముందుకు జరిపి మార్చి 15న తీసుకువస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికైతే దీనికి సంబంధించిన ఎలా ప్రకటన చేయలేదు.