నటీనటులు సినిమా కోసం, పాత్రల కోసం తమ లుక్‌ని మార్చుకునేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అవసరమైతే బరువెక్కుతారు, మరీ సన్నగానూ మారిపోతారు. నటనలో ఇది ఓ భాగం. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌బీ తనయుడు, హీరో అభిషేక్‌ బచ్చన్‌ సైతం ఊహించని లుక్‌లోకి మారిపోయారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `బాబ్‌ బిస్వాస్‌` చిత్రంలో కోసం  ఓ కొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. 

చాలా రోజులుగా సక్సెస్‌ల కోసం వెయిట్‌ చేస్తున్న అభిషేక్‌ బచ్చన్‌ ప్రస్తుతం థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే `బాబ్‌ బిస్వాస్‌` చిత్రంలో నటిస్తున్నాడు. సుజోయ్‌ ఘోష్‌ కుమార్తె డియా అన్నపూర్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, షారూఖ్‌ ఖాన్‌కి చెందిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌ `కహానీ` చిత్రంలోని కాంట్రాక్ట్ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో నటిస్తున్నారు. `కహానీ` చిత్రంలో ఆ పాత్రని బెంగాలీ న టుడు సస్వతా ఛటర్జీ పోషించారు. ఇప్పుడు అభిషేక్‌ పోషిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని అభిషేక్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో గుర్తుపట్టని విధంగా మారిపోయారు అభిషేక్‌. బాగా బరువెక్కారు. ఫుల్‌ స్లీవ్‌ చొక్కా, పెద్ద కళ్లజోడు, మిడ్‌ పార్టీషియన్‌ జుట్టుతో కనిపిస్తున్న అభిషేక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. టక్‌ చేసుకుని నడి వయస్కుడిగా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కోల్‌కతాలో జరుగుతుంది. ఇందులో అభిషేక్‌ సరసన చిత్రాంగద సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.