‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘పుష్ఫక విమానం’తో ఆకట్టుకున్న ఆనంద్.. మరో కొత్త ఫిల్మ్ తో ఎంటర్ టైన్ చేయనున్నాడు. ఈ మేరకు ఆ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
దేవరకొండ బ్రదర్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. అన్నకు పోటీపడుతూ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు.
అయితే ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పకవిమానం’.నవంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద కొంత మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీనూ రిలీజైంది. అయితే మన చుట్టూ ఉండే కథలనే సినిమాలుగా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆనంద్ దేవరకొండ. తన అన్నయ్య విజయ్‌దేవరకొండ నీడలో ఇండస్ట్రీకి వచ్చినా మాస్ కథల జోలికి పోకుండా సామాన్య పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’తో డీసెంట్ హిట్ కొట్టి ‘పుష్పక విమానం’అంటూ మరో చిత్రంతో మన ముందుకు వచ్చారు.
ప్రస్తుతం మరో చిత్రం‘గం గం గణేశా’లో నటించేందుకు రెడీ అయ్యాడు ఆనంద్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్స్ తాజాగా రిలీజ్ చేశారు. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉదయ్ శెట్టి’ దర్శకత్వం వహిస్తున్నారు. కేదార్ సెలగమ్ శెట్టి మరియు వంశీ కురుమంచి నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. కాగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ వివరాలను త్వరలో వెల్లడించనుంది చిత్ర యూనిట్.
కాగా, ఇప్పటి వరకు యాక్షన్ సీన్లకు దూరంగా ఉన్న ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో గన్స్, ఆకట్టుకునే ఫైట్ సీన్లతో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మరోవైపు పోస్టర్ మేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. ‘యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్’అంటూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఆనంద్ ఈ మూవీలో కొత్త అవతారం ఎత్తనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్న విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్’లో ఆకట్టుకునే ఫైట్స్ సీన్లు ఉండనున్నాయి. కాగా, ఆనంద్ దేవరకొండ కూడా తన అప్ కమింగ్ ఫిల్మ్ గం గం గణేశాలో మాస్ రోల్ లో కనిపించి అలరించనున్నాడు.
