బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టాలనే ఆశతో హీరో అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా అమీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చోటు దక్కించుకుంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ పెట్టిన పెట్టుబడి తీసుకొస్తుందా.. లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

నిజానికి ఈ సినిమా రిజల్ట్ అమీర్ కి ముందే అర్ధమై ఉంటుంది. అందుకే తన స్టైల్ లో సినిమాలను ప్రమోట్ చేసే ఈ హీరో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' విషయంలో మాత్రం అలా చేయలేదు. సినిమా ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిపోయాడు.

అయితే బాహుబలిని కొట్టాలనే పంతం మాత్రం అతడిలో పోలేదని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. బాహుబలిని మించి సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చైనా, ఇతర దేశాల్లో అతడి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని వెయ్యి కోట్ల బడ్జెట్ తో భారీ పౌరాణిక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

దీనికి సంబంధించి కొందరు రైటర్లు, దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. అమీర్ ఖాన్ ఒప్పుకుంటే సినిమాను నిర్మించడానికి రెండు, మూడు కార్పోరేట్ కంపనీలు కూడా సిద్ధంగా ఉన్నాయని సమాచారం.