టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. వరుసగా ఫిలిం స్టార్స్‌ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. కరోనాను సైతం లెక్కచేయకుండా మూడు ముళ్ల బంధంలో ఒక్కటవుతున్నారు తారలు. ఇప్పటికే నిఖిల్, నితిన్‌ లాంటి యంగ్‌ హీరోలు పెళ్లి చేసుకోగా త్వరలో మరో యంగ్ హీరో రానా కూడా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో చేరేందుకు మరో యంగ్‌ హీరో కూడా రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది పినిశెట్టి. విలక్షణ పాత్రలతో బహు భాషా నటుడిగా పేరు తెచ్చుకున్న ఆది, త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తనతో కలిసి నటించిన హీరోయిన్‌నే ఆది పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ మేరకు మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన నిక్కీ గల్రానీని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడట.

ఆది, నిక్కీ గల్రానీలు మలుపు, మరకతమణి సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైందని, ప్రస్తుతం ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల ఆది తండ్రి రవిరాజ పినిశెట్టి పుట్టిన రోజు వేడుకల్లో  కూడా నిక్కీ సందడి చేసింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరినటైంది. కానీ ఈ వార్తలపై ఆది, నిక్కీలు ఇంత వరకు స్పందించలేదు.