సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు రవితేజ కూడా కో ఆపరేట్ చేయమని చెప్పడంతో తాము రేసు నుంచి తప్పుకున్నామని ‘ఈగల్’ నిర్మాత తెలిపారు.
సంక్రాంతికు రిలీజ్ కు రెడీ అయిన అయిదు సినిమాలలో ఒకటి స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. అదే ‘ఈగల్’. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ.. పోటీని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అయితే రవితేజ చేసిన ఈ సాయానికి వారికి ఏ పోటీ లేకుండా ఒక సోలో రిలీజ్ డేట్ ఇచ్చామని, కొత్త విడుదల తేదీని తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడే ట్విస్ట్ పడుతోంది. ఈగల్ సినిమాకు సింగిల్ రిలీజ్ డేట్‌గా ఫిబ్రవరి 9 ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈగల్ సినిమాకు పోటీగా మరో మూడు సినిమాలు రంగంలోకి దూకుతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్ సలామ్ విడుదల కానుంది. అంటే ఈగల్ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఈగల్ సినిమాకు సంబంధించిన పీపుల్స్ మీడియా వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు. ఓ రకంగా ఇది దిల్ రాజుని ఉద్దేశించిన లెటర్ అని అంటోంది ఇండస్ట్రీ. ఎందుకంటే దిల్ రాజు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన్నే డైరక్ట్ గా అడుతున్నట్లు..ఇప్పుడు ఆయన ఎలా మిగతావాళ్లను ఒప్పించి వాళ్లను వాయిదా వేసుకోమని అడుగుతారో చూడాలంటున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...‘‘ఈగల్ ఫిబ్రవరి 9న రావడానికి డేట్ అడిగారు. ఆ సినిమా 9కు రావాలి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు ఆ విడుదల తేదీని అనౌన్స్ చేశాయి. ఆ రెండు సినిమాల నిర్మాతలతో కూడా మాట్లాడాము. వాళ్లని ఒప్పించి.. ఫిబ్రవరి 9న ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాం. నిర్మాత నాగవంశీకి ‘గుంటూరు కారం’ రిలీజ్ రెడీగా ఉంది కాబట్టి ఆయన వెంటనే ‘డీజే టిల్లు 2’ను పోస్ట్‌పోన్ చేయడానికి ఓకే చెప్పారు. ఇంకొక మూవీ ‘యాత్ర 2’ ఉంది. దాని నిర్మాత ఇంకా కాంటాక్ట్ కాలేదు. ఆయనతో కూడా మాట్లాడి వీలైతే ఇంకొక వారం ముందు అయినా, తరువాత అయినా విడుదల తేదీ చూసుకోమని అడుగుతాము’’ అంటూ ‘ఈగల్’ కొత్త విడుదల తేదీ ఫిబ్రవరి 9 అని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇక సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు రవితేజ కూడా కో ఆపరేట్ చేయమని చెప్పడంతో తాము రేసు నుంచి తప్పుకున్నామని ‘ఈగల్’ నిర్మాత తెలిపారు.
సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో తమ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరింది. ఈ లేఖకు ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని పరిమాణం ఇది..
