ఆహార,విహార  విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే బిగ్ బీ అమితాబ్ హెల్త్ పరంగా నిర్లక్ష్యం చేయటం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆయన తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టాడు. స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ… తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను ముందే గుర్తించి సులభంగా ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. టీబీ సోకిన 8 ఏళ్ల వరకు తనకు ఆ విషయమే తెలియదని, చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో బయటపడిందని తెలిపాడు.

‘గతంలో నాకు క్షయ(టిబి), హెపటైటిస్ బి వ్యాధులు ఉండేది. క్షయ సోకిందనే విషయం 8 ఏళ్ల వరకు తెలియలేదు. రెగ్యులర్‍‌ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో నా 75 శాతం లివర్(కాలేయం) చెడిపోయింది. ప్రస్తుతం నేను 25 శాతం కాలేయంతోనే సర్వైవ్ అవుతున్నాను’ అని అమితాబ్ బచ్చన్ తెలిపాడు.

76 ఏళ్ల అమితాబ్ బచ్చన్ పలు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. పోలియో, హైపటైటిస్-బీ, క్షయ, డయాబెటిస్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటేనే మనలో ఉన్న వ్యాధులు బయటపడతాయని ప్రజలకు సూచించాడు. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని.. అప్పుడే ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పాడు అమితాబ్. బిగ్ బీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూవీ సైరాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.