2023వ ఏడాదికిగానూ తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఏకంగా ఏడు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో ఆయా విజేతలు స్పందించి ఆనందం వ్యక్తం చేశారు. 

DID YOU
KNOW
?
బేబీ హిందీలో రీమేక్‌
రెండు జాతీయ అవార్డులు అందుకున్న `బేబీ` మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేస్తున్నారు దర్శకుడు సాయి రాజేష్‌. త్వరలో ఇది ప్రారంభం కానుంది.

71వ నేషనల్‌ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు మన తెలుగు సినిమాలకు రావడం విశేషం. `భగవంత్‌ కేసరి`(ఉత్తమ తెలుగు సినిమా-సాహు గారపాటి), ``బేబీ`(బెస్ట్ స్క్రీన్‌ ప్లే-సాయి రాజేష్‌, ప్లే బ్యాక్‌ సింగర్‌-రోహిత్‌), `బలగం`(ఉత్తమ లిరిక్‌ రైటర్‌-కాసర్ల శ్యామ్‌), `గాంధీ తాత చెట్టు`(బాలనటి-సుకృతి వేణి), `హనుమాన్‌`(స్టంట్ కొరియోగ్రఫీ-నందు, పృథ్వీ, యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్) చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా మేకర్స్ తమ సంతోషాన్ని వెల్లడించారు. `బేబీ` మూవీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. అలాగే రైటర్‌ కాసర్ల శ్యామ్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు `హనుమాన్‌` డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఆనందాన్ని పంచుకుంటూ విజేతలకు అభినందనలు తెలియజేశారు. 

`బేబీ`కి జాతీయ అవార్డులు రావడంపై సాయి రాజేష్‌ ఎమోషనల్‌ 

`బేబీ` మూవీకి బెస్ట్ స్క్రీన్‌ ప్లే( సాయి రాజేష్‌), బెస్ట్ ప్లే బ్యాక్‌ సింగర్‌(రోహిత్‌) లకు జాతీయ అవార్డులు వరించిన నేపథ్యంలో చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. `71వ జాతీయ అవార్డుల్లో `బేబీ` మూవీ రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. రెండు ముఖ్యమైన కేటగిరీలో ఈ అవార్డులు గెలుచుకున్నాం. ఒకటి బెస్ట్ స్క్రీన్‌ ప్లే, మరోటి మేల్‌ సింగర్‌. ఇది నా కెరీర్‌కి గొప్ప మూమెంట్‌. ఒక గేమ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌ అనుకోవచ్చు. స్క్రీన్‌ ప్లేకి అవార్డు రావడమనేది చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది.

నిర్మాత ఎస్‌కేఎన్‌ నమ్మకపోతే ఈ గుర్తింపు, ఈ విజయం దక్కేది కాదు. చిన్న సినిమా అయినా నమ్మి, నిర్మించి ఇప్పుడు ఈ గౌరవం తీసుకొచ్చాడు. ఈ విషయంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. నా టీమ్‌ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సింగర్‌ రోహిత్‌కి. తను చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాగా పాటని పాడాడు. నా సినిమాతో పెద్ద బ్రేక్‌ కావడం చాలా పెద్ద మూమెంట్‌. ఈ సారి మనకు ఎక్కువ అవార్డులు వచ్చాయి. `భగవంత్ కేసరి`, `హనుమాన్‌`, `యానిమల్‌`, `బలగం` వంటి సినిమాలు జాతీయ అవార్డులు వచ్చాయి. వారందరికి అభినందనలు` అని తెలిపారు దర్శకుడు సాయి రాజేష్‌

`ఊరుపల్లెటూరు` పాటకి అవార్డు రావడంపై కాసర్ల శ్యామ్‌ ఆసక్తికర కామెంట్‌

`బలగం` సినిమాకి పాట రాసిన కాసర్ల శ్యామ్‌కి బెస్ట్ లిరిక్‌ రైటర్‌ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. `ఊరు పల్లెటూరు` పాటకిగానూ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం విశేషం. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు కాసర్ల శ్యామ్‌. `తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారం. `బలగం` సినిమాలోని `ఊరు పల్లెటూరు` పాట రాసినందుకుగానూ నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణమైన దర్శకుడు వేణు యెల్దండికి, నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షితలకు, అలాగే నిర్మాత దిల్‌ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

ఇంత మంచి పాటకి సంగీతం సమకూర్చిన భీమ్స్ కి, గాయకులు రామ్‌ మిర్యాల, మంగ్లీలకు కూడా నా ధన్యవాదాలు. ఎందరో మహానుభావుల తర్వాత నాకు ఈ జాతీయ అవార్డు రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగు వాడిగా నేను చాలా సంతోషపడుతున్నా` అని వెల్లడించారు కాసర్ల శ్యామ్‌. తనదైన స్టయిల్‌లో పాట పాడి అలరించారు.

`హనుమాన్‌`కి రెండు అవార్డు దక్కడంపై ప్రశాంత్‌ వర్మ ఆనందం

 ప్రశాంత్‌ వర్మ తన ఆనందాన్ని పంచుకుంటూ `2023కిగానూ అందించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో `హనుమాన్‌` సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. యానిమేషన్‌ వీఎఫ్‌ఎక్స్ కేటగిరిలో, బెస్ట్ యాక్షన్‌ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి. మా వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌ వెంకట్‌ కుమార్‌కి అభినందనలు తెలియజేస్తున్నా. యాక్షన్‌ కొరియోగ్రఫీలో నందు, పృథ్వీ మాస్టర్లకు ఈ జాతీయ అవార్డు వచ్చింది. వారికి అభినందనలు. వీరికి అవార్డులు వచ్చాయంటే దీని వెనుక ఎంతో మంది కృషి ఉంది. మా నిర్మాతలు, యాక్టర్స్, టెక్నీషియన్స్ వీరందరిని నా తరఫున ధన్యవాదాలు` అని వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.