ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడు శంకర్ సృష్టించిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. టైటిల్స్ లో ఆయన పేరు లేకపోయినా కూడా షాట్ మేకింగ్ చూసి ఇది శంకర్ చిత్రమని ఇట్టే పసిగట్టవచ్చు. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 15 ఏళ్ల క్రితమే జీన్స్ సినిమాలో ప్రపంచంలోని ఏడూ వింతలను ఒక పాటలో చూపించి మరో అద్భుతం చూపించాడు. 

ఇక 2.0 లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పాట కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టించాడు. 400 కోట్లకు పైగా నిర్మించిన సినిమాలో శంకర్ ఆలోచన విధానం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ పాట బడ్జెట్ తో ఒక మీడియా సైజ్ సినిమాను నిర్మించవచ్చు. ఇండియాలోనే అత్యంత భారీ ఖర్చుతో తీసిన ఫస్ట్ సాంగ్ ఇదే. 10 రోజుల పాటు చెన్నై లో వేసిన నాలుగు సెట్స్ లలో పాటను చిత్రీకరించారు. 

రెండు రోబోల మధ్య యంతర లోకపు సుందరివే అంటూ రొమాన్స్ చేయించి శంకర్ విజువల్ వరల్డ్ ని చూపించాడు. సినిమా 29న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ డోస్ ఏ మాత్రం తగ్గకూడదని దాదాపు పాటను పూర్తిగా రిలీజ్ చేశారు. పాటలో అమీ తన సరికొత్త గెటప్స్ తో అబ్బురపరచగా రజినీ తనదైన స్టైల్ లో మెప్పించాడు.