కాలం వేగంగా పరిగెడుతున్న కొద్దీ మన టాలీవుడ్ కూడా ప్రతి ఏడాది తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోంది. కొన్నేళ్ల వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో టాప్ 1 లో ఉన్న బాలీవుడ్ కి సైతం షాకిచ్చేలా ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఒక ప్రత్యేక మార్కెట్ ను తెలుగు సినిమాలు ఏర్పాటు చేస్తున్నాయి.
2018లో ఎప్పటిలానే వందల సినిమాలు రిలీజయ్యాయి. అందులో హిట్టయిన సినిమాలకంటే బొక్కబోర్లా పడ్డ సినిమాలే ఎక్కువ. ఇక 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాల గురించి మాట్లాడుకుంటే నాలుగు ప్రధాన సినిమాలు టాప్ బాక్స్ ఆఫీస్ లిస్ట్ లో ఉన్నాయి.
గీతగోవిందం:
టాలీవుడ్ లో ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నా కూడా ఈ సినిమా అందించిన లాభాలను ఈ ఏడాది ఏ సినిమా కూడా అందించలేదని చెప్పాలి. కేవలం 10 కోట్ల లోపే సినిమాకు ఖర్చు చేయగా 118 కోట్ల గ్రాస్ ను అందుకొని కాసుల వర్షాన్ని కురిపించింది. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ అండ్ రష్మిక నటన సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా సినిమా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా 2018లో పెట్టిన పెట్టుబడికి ఊహించనంత లాభాలను అందించిన గీతగోవిందం బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు.
రంగస్థలం:
1980 బ్యాక్ డ్రాప్ లో తెలుగు పల్లెను, అలాగే అప్పటి మనుషులు ఉండే వాతావరణాన్ని దర్శకుడు సుకుమార్ చూపించిన విధానం రంగస్థలం సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఈ సినిమా కూడా కలెక్షన్స్ లో సెంచరీ బాధేసి డబుల్ సెంచరి కలెక్షన్స్ దగ్గర బాక్స్ ఆఫీస్ ఇన్నింగ్స్ ను ముగించింది. రామ్ చరణ్ నటనలో రాటు దేలినట్లు ఈ సినిమాతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. పైగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చంద్రబోస్ సాహిత్యం సినిమాకు మంచి క్రేజ్ తెచ్చాయి.
భారత్ అనే నేను:
శ్రీమంతుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ మరోసారి సినిమా చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా దర్శకుడు కొరటాల మహేష్ ను క్లాస్ మాస్ యాంగిల్స్ లలో ముఖ్యమంత్రిగా చూపించి మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా 200 కోట్లను గ్రాస్ చేసినట్లు పోస్టర్స్ రిలీజైనప్పటికీ 168 కోట్ల వసూళ్లను మాత్రమే అందుకుందని కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా ఈ సినిమా కూడా 100 కోట్లను క్రాస్ చేసి మహేష్ రేంజ్ ను పెంచింది.
అరవింద సమేత:
ఈ ఏడాది భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా ఇదే. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఈ ఏడాది చివరలో మొత్తానికి హిట్ తో 2018కి గుడ్ బై చెప్పేశాడు. 80 కోట్లతో తెరకెక్కిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధికంగా 158 కోట్లను అందుకుంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి డైలాగ్స్ హైలెట్స్ గా నిలవడంతో బాక్స్ ఆఫీస్ ముందు అరవింద 100 కోట్లను క్రాస్ చేయగలిగాడు.
