స్టార్ హీరోలు ఏడాదిలో కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటారు. మారుతున్న సమీకరణాల బట్టి ప్రేక్షకులకు తమ సినిమాలతో టచ్ లోనే ఉండాలనుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు లాంటి హీరోలు సైతం ఇప్పుడు గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నారు. హీరోలు యాక్టివ్ గా ఉంటేనే.. ఇండస్ట్రీ కూడా సందడిగా ఉంటుంది. కానీ ఈ ఏడాదిలో కొందరు స్టార్ హీరోలు థియేటర్ లో కనిపించలేదు. కారణం ఏవైనా కావొచ్చు కానీ వారి అభిమానులు మాత్రం వారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆ కనిపించని హీరోల లిస్ట్ పరిశీలిస్తే.. ముందుగా ప్రభాస్ పేరు చెప్పుకోవాలి. 

ప్రభాస్:

ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించే ప్రభాస్ 'బాహుబలి' సినిమా కోసం ఐదేళ్ల పాటు తన డేట్స్ ఇచ్చేశాడు. ఎంతో డెడికేషన్ తో 'బాహుబలి' సినిమాకి పని చేశాడు. బాహుబలి తరువాత అతడి నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా 'సాహో'లో నటిస్తున్నాడు. అది కూడా ఇప్పట్లో రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సో వచ్చే  ఏడాది వరకు ప్రభాస్ కోసం ఎదురుచూడక తప్పదు. ఈ ఏడాదిలో మాత్రం తన 'సాహో' సినిమా టీజర్ తో సరిపెట్టేశాడు ప్రభాస్. 

రానా:

ప్రభాస్ తో పాటు బాహుబలిలో నటించిన రానా కూడా ఈ ఏడాది థియేటర్ లో కనిపించలేదు. బాహుబలి సినిమా తరువాత రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రానా చేతిలో ఓ బాలీవుడ్ అలానే రెండు సౌత్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాడు రానా. ఈ ఏడాదిలో మాత్రం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోయాడు. సుమంత్ నటించిన 'సుబ్రమణ్యంపురం' సినిమాకి మాత్రం తన వాయిస్ ని అందించాడు రానా. 

వెంకటేష్:

సీనియర్ హీరో వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటిది 'గురు' సినిమా తరువాత ఆయన ఇప్పటివరకు మరో సినిమా విడుదల చేయలేదు. చాలా గ్యాప్ తీసుకొని 'ఎఫ్ 2' సినిమా ఓకే చేశాడు. ఇతదితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నా వెంకటేష్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఈ ఏడాదిలో కాస్త విశ్రాంతి తీసుకొని రెండు సినిమాలు ఓకే చేశాడు.  'ఎఫ్2' సినిమా 2019 సంక్రాంతికి వస్తుండగా.. ఆ తరువాత నాగచైతన్యతో 'వెంకీమామ' అనే మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. 

అఖిల్:

ఇక కుర్ర హీరో అఖిల్ కూడా ఈ ఏడాది గాయబ్ అయిపోయాడు. 'హలో' సినిమా కూడా ఆశించిన హిట్ కాకపోవడంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలో 2018లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. తను నటించిన 'మిస్టర్ మజ్ను' వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి 
డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు అఖిల్. ఈ ఏడాది స్కిప్ చేసినా వచ్చే ఏడాదైనా హిట్ అనుకుంటాడేమో చూడాలి!