పెద్ద హీరోని పెట్టి నలభై, యాభై కోట్ల పెట్టుబడితో సినిమా తీసి కేవలం రెండు, మూడు కోట్లు లాభాలు చూస్తోన్న నిర్మాతలకు చిన్న చిత్రాలు బాసటగా నిలుస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో కొత్త వారితో సినిమాలు తీసి కోట్లలో లాభాలు దండుకుంటున్నారు నిర్మాతలు. కొన్ని చిన్న సినిమాలైతే పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద నిలిచాయి. ఈ ఏడాదిలో అలా సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. 

ఛలో.. 
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'ఛలో' సినిమా ఊహించని సక్సెస్ అందుకుంది. అప్పటివరకు ఫ్లాప్ లతో డీలా పడ్డ నాగశౌర్యకి ఈ సినిమా ఊరట కలిగించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక టాలీవుడ్ లో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే తన సత్తా చాటాడు. సినిమా మీద నమ్మకంతో హీరోగా 
శౌర్య నిర్మాతగా కూడా మారాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి వెంకీ రూపంలో టాలెంటెడ్ డైరెక్టర్ తో పాటు రష్మిక లాంటి ముద్దుగుమ్మ లభించింది. 

తొలిప్రేమ.. 
మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ సినిమా కథ, పాటలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి మంచి పేరు దక్కింది. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇప్పుడు హీరో అఖిల్ ని డైరెక్ట్ చేస్తూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఈ సినిమా నిర్మాతలకు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు మంచి పేరుని కూడా తీసుకొచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా 
మల్టీప్లెక్స్ థియేటర్లలో చాలా రోజుల పాటు ఆడుతూనే ఉంది. 

సమ్మోహనం.. 
మంచి కథలు పడితే సుధీర్ బాబు మార్కెట్ ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా 'సమ్మోహనం'. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అతిథిరావు హైదరి అందాలకు యూత్ ఫిదా అయిపోయింది. తెరపై సుధీర్ బాబు-అతిథి ల జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫీల్ గుడ్ సాంగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. 

ఆర్ఎక్స్ 100.. 
'అర్జున్ రెడ్డి' సినిమా నుండి స్ఫూర్తి పొంది ముద్దు సీన్లు ఎక్కువగా పెట్టారంటూ 'ఆర్ఎక్స్ 100' సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు విమర్శలు వినిపించాయి. కానీ సినిమా విడుదలై అందరి నోళ్లను మూయించింది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడని కొత్త లైన్ తో సినిమా తెరకెక్కించి కొత్త దర్శకుడు అజయ్ భూపతి సక్సెస్ అందుకున్నాడు. నిర్మాతలకు పది రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాలో పాట ఇప్పటికీ యూత్ పాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి పాయల్ రాజ్ పుత్ అనే బాలీవుడ్ నటి 
పరిచయమైంది. 

గీతగోవిందం..
చిన్న సినిమాల్లో ఓ మైలురాయిని సృష్టించిన సినిమా 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. వంద కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు యూత్ కి మాత్రమే పరిమితమైన విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా పాకింది. సింపుల్ లైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు పరశురాం. పాటలు సైతం సినిమా సక్సెస్ లో భాగంగా నిలిచాయి. 

గూఢ‌చారి.. 
టాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమా అంటూ ప్రమోట్ చేసిన చిత్రబృందం ఆ రేంజ్ విజయాన్ని 'గూఢ‌చారి' చిత్రంతో అందుకుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో సరికొత్త కథతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో శశికిరణ్ తిక్క అనే దర్శకుడు తెలుగు తెరకి పరిచయమయ్యాడు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీతో సినిమాను రూపొందించాడు. ఈ సినిమాతో శోబిత దూలిపాల్ల అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా పరిచయమైంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అయితే సీక్వెల్ కి మాత్రం దర్శకుడు మారుతున్నట్లు తెలుస్తోంది. 

టాక్సీవాలా.. 
సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది 'టాక్సీవాలా' సినిమా. ఎడిట్ చేయని మూడు గంటల సినిమాను లీక్ చేసేశారు. పైరసీ వెర్షన్ చూసిన వారంతా కూడా సినిమా ఏవరేజ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంతో ఈ సినిమాపై ఎవరికీ నమ్మకాలు ఉండేవి కాదు. కానీ ఎడిట్ చేసిన రెండున్నర గంటల సినిమా థియేటర్ లోకి వచ్చిన తొలిరోజే సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సరికొత్త జోనర్ లో రూపొందించిన ఈ సినిమా ఊహించని విజయంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ సినిమాతో రాహుల్ సాంక్రిత్యన్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.