సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సినిమా 'టూ స్టేట్స్' ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' నవల ఆధారంగా బాలీవుడ్ లో సినిమాను రూపొందించారు. 

దాని రీమేక్ గా తెలుగులో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. వెంకట్ రెడ్డి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఎంఎల్ వి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది. 

కథ విషయంలో దర్శక, నిర్మాతలకు మధ్య విబేధాలు రావడంతో చిత్రీకరణ ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు వెంకట్ రెడ్డి.. నిర్మాతపై కేసు వేశారు. అనంతరం దర్శకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అవుట్ పుట్ బాగా వస్తున్న సమయంలో నిర్మాత కథలో మార్పులు చేయాల్సిందిగా తనను కోరారని దానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి తప్పించడానికి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

దీంతో కోర్టుని ఆశ్రయించినట్లు చెప్పారు. విచారణ జరిపిన కోర్టు నిర్మాత సత్యనారాయణ ఈ నెల 30న కోర్టులో హాజరై, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇంకా ముప్పై శాతం చిత్రీకరణ జరగాల్సి ఉండగా.. తనను కాదని వేరే వారికి దర్శకత్వం ఛాన్స్ ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.