శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 2 పాయింట్ ఓ గత ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తమిళ్ సినిమాగా 2.ఓ నిలిచినప్పటికీ పెద్దగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. అయితే సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చెయ్యాలని చైనీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ HY మీడియా ప్లాన్ వేసింది. 

దాదాపు 60 వేల స్క్రీన్ లలో జులై 12న చైనాలో రిలీజ్ కావాల్సిన సూపర్ స్టార్ సినిమా సడన్ గా వాయిదా పడింది. ఎందుకంటే రీసెంట్ గా HY మీడియా పలు బాలువూడ్ సినిమాలను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేసి నష్టాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ చైనీస్ ప్రజలును మెప్పించలేకపోయింది. 

అందుకే ఇప్పుడు 3డిలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ 2 పాయింట్ ఓ ను కూడా అత్యధిక ఖర్చుతో విడుదల చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని డిస్ట్రిబ్యూషన్ సంస్థ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ క్యాన్సిల్ అవ్వడానికి మరో ప్రధాన కారణం లయన్ కింగ్. ఈ హాలీవుడ్ సినిమా కోసం చైనీస్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే 2.ఓ తో రిస్క్ చేయవద్దని లయన్ కింగ్ హడావుడి తగ్గాక రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.