తెలుగులో బయోపిక్ లు నిర్మాణమే కాదు ..పోటీ కూడా నడుస్తోంది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖర రెడ్డి   బయోపిక్‌లు మధ్యనే ఈ పోటీ ఉండనుంది. ఇప్పటివరకూ ఎవరి బయోపిక్ వారిది అన్నట్లుగా ముందుకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా రిలీజ్ విషయంలో వైయస్ బయోపిక్ యూటర్న్ తీసుకుంది. రిలీజ్ డేట్ ని మార్చేసిందని సమాచారం. 

మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథగా తెరకెక్కుతున్న 'యాత్ర' చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే  నిర్మాతలు ప్రకటించారు. ఆ రోజున వైసీపీ అధినేత జగన్ జన్మదినం కావడంతో ఆ రోజునే ఫిక్స్ చేసారు. అయితే.. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్‌ 21న విడుదల కావడం లేదట.

బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న  సినిమాకు పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారట.  ఎన్టీఆర్  చిత్రాన్ని ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు, యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్‌ బయోపిక్‌ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్ర యూనిట్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.

వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న  ‘యాత్ర’ సినిమా లో  వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.  జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.