మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో  జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మెగాఫ్యామిలీకి క్రేజ్ ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సినిమా హక్కులను రూ.19..6 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఆ జిల్లాల్లో 'బాహుబలి 2', 'సాహో' సినిమా హక్కులు కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోలేదని.. 'సైరా' రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో నిర్మాతలు వెల్లడించాల్సివుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.