సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సినిమా ప్రమోషన్స్ కోసం యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా చాలా మాధ్యమాలను వాడుకుంటున్నారు. ఇక వాటికి రికార్డులు కూడా తయారవుతున్నాయి. మా సినిమా అత్యధిక వ్యూస్ వచ్చాయి... మా పాటకి వచ్చినన్ని లైక్స్ దేనికీ రాలేదు.. మా టీజర్ ని పది నిమిషాల్లో పది మిలియన్ వ్యూస్.. అంటూ ఈ దర్శకనిర్మాతలు డబ్బా కొట్టుకుంటున్నారు.

ఒకప్పుడు ఆడియో క్యాసెట్ సేల్స్ గురించి, వంద రోజుల సెంటర్ల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఆ తరువాత సినిమా కలెక్షన్స్ గురించి చెప్పుకునేవారు. ఇప్పుడేమో సోషల్ మీడియా వ్యూస్ బెంచ్ మార్క్ గా సెట్ చేశారు.

మెగాస్టార్ కంటే తనే ఎక్కువ కష్టపడ్డానని చెబుతోంది!

జియో ఇంటర్నెట్ వాడకం పెరిగిన తరువాత వ్యూస్, లైక్స్ పెరగడం మామూలు విషయం అయిపోయింది. చిన్న చిన్న సినిమాలకి సైతం మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటున్నాయి.  అలాంటిది ఇక స్టార్ హీరోల సినిమాలకు కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ రావడంలో ఆశ్చర్యమేముంది. పైగా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం కొన్ని టీమ్స్ ని ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు.

కొంతమంది డబ్బులు తీసుకొని రికార్డులు కొట్టించే పనులు కూడా చేస్తున్నారు. దీని వల్ల కొన్ని ఫేక్ రికార్డులు కూడా తయారవుతున్నాయి. మొన్నటివరకు తమిళంలో అజిత్, విజయ్ ల ఫ్యాన్స్ విషయంలో ఉండే ఈ రచ్చ ఇప్పుడు  తెలుగులో కూడా ఊపందుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

ఈ రెండు చిత్రాల మేకర్స్ తమ సినిమా గొప్పంటే తమ సినిమానే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పాటల వ్యూస్, లైక్స్, టీజర్ వ్యూస్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ఒకరివి ఫేక్ వ్యూస్ అంటూ మరొకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యూస్, రికార్డులు వల్ల కలిగే ప్రయోజనమేమీ ఉండదు.. అవి సినిమా రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించలేదు. ఈ హడావిడితో కూడిన పబ్లిసిటీ మీద దృష్టి పెట్టే కంటే సినిమా కథ, కథనాల విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది!