పవన్ సినిమాకు ఏ టైటిల్ పెట్టినా అది పాపులర్ అయ్యిపోతుంది. ఆ విషయం గతంలో చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఖుషీ, జల్సా,పంజా, అత్తారింటికి దారేది ఈ టైటిల్స్ పెట్టక ముందు..చాలా మామూలుగా అనిపించినవి...ఒక్కసారి పవన్ సినిమాకు ఫిక్స్ చేసాక ఆ టైటిల్స్ కే ఓ గ్లామర్ వచ్చేసింది. దాంతో ఆయన సినిమాకు టైటిల్ విషయంలో దర్శక,నిర్మాతలు పెద్దగా టెన్షన్ పెట్టుకోరు.

అయితే దర్శకుడు క్రిష్ ది ఓ ప్రత్యేకమైన దారి. తన సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి , టైటిల్స్ దాకా ప్రతీది విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇప్పుడు ఆయన ఓ టైటిల్ ని పవన్ కోసం రెడీ చేసినట్లు మీడియా వర్గాల సమాచారం. పవన్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు 'విరూపాక్షి' అనే టైటిల్ పెడుతున్నట్లు  ప్రచారం జరుగుతోంది.

న్యూ లుక్.. గడ్డం తీసేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

ఇందులో పవన్ ..వీర అనే పేరు గల దొంగ గా కనిపిస్తాడట. 18 శతాబ్దంనాటి రాబిన్ హుడ్ తరహా పాత్ర ఇది అని తెలుస్తోంది. పవన్‌తో 'ఖుషి' లాంటి సంచలన సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూట్ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 25 కోట్లు ఖర్చు చేసి తాజ్ మహల్, చార్మినార్ సెట్స్ నిర్మించారు. అన్నీ కుదిరితే ఇదే ఏడాది పవన్ క్రిష్ సినిమా విడుదల కానుంది.

అలాగే ఈ సినిమాలో పవన్ కు  ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒక పాత్రకు ఇంతకుముందు కియారా అద్వానీ పేరు ప్రచారంలోకి రాగా.. ఇప్పుడు కీర్తి సురేష్ పవన్‌తో జోడీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్ తో ఒకసారి జోడి కట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి ఈ జోడి రిపీట్ చేయాలని చూస్తున్నాడు క్రిష్. అలాగే ఈ చిత్రం అనసూయ భరద్వాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.