చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రం వెండితెరపై ఆవిష్కృతమైంది. గాంధీ జయంతి సందర్భంగా సైరా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేశారు. నార్త్ లో సైరా చిత్రం నిరాశ పరిచినప్పటికీ తెలుగులో అఖండ విజయం సాధించింది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయి నటించారు. ఆరుపదుల వయసులో మెగాస్టార్ సైరా చిత్రంలో చేసిన యాక్షన్ సీన్స్ అబ్బురపరిచాయి. సైరా విడుదలయ్యాక చిరంజీవి వివిధ రాజకీయ ప్రముఖుల్ని కలుసుకుంటున్నారు. 

బుధవారం రోజు చిరు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని చిరు ఆయన నివాసంలో కలుసుకున్నారు. బుధవారం సాయంత్రం సైరా స్పెషల్ షోని చిరంజీవితో కలసి వెంకయ్య వీక్షించారు. అనంతరం సినిమా బావుందంటూ చిత్ర యూనిట్ ని వెంకయ్య అభినందించిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో కూడా మాట్లాడారు. సైరా చిత్రంలో నటించిన తమన్నాని ప్రత్యేకంగా అభినందించాలి. గతంలోకూడా తమన్నాని నేను చూశాను. సైరా చిత్రంలో ఆ అమ్మాయి వీరవనితగా అద్భుతంగా నటించింది. నయనతార కూడా బాగా నటించింది అని వెంకయ్య అన్నారు. 

నేనప్పుడే చెప్పా.. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇప్పుడు మెగాస్టార్: ఉపరాష్ట్రపతి

సైరా చిత్రం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది. మనలో మనకి పడకపోవడం, ఐకమత్యం లోపించడం వల్లే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారు. ఆ అంశాలని సైరా చిత్రంలో చక్కగా చూపించారు. మనమంతా కలసిమెలిసి ఉండాలనే సంగతిని సైరా చిత్రం గుర్తు చేసే విధంగా ఉందని వెంకయ్య ప్రశంసించారు.