రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి కన్న కల ఇప్పటికి సాకారమైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు అద్భుతంగా నటించారు. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. 

ఇదిలా ఉండగా చిరు ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నేడు చిరంజీవి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కలుసుకోవడమే కాదు సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా వెంకయ్య కోసం ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం వెంకయ్య నాయుడు చిరంజీవిని అభినందించారు. 

చిరుతో వెంకయ్య మాట్లాడుతూ.. నేను చాలా రోజుల క్రితమే చెప్పా ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగులో ఉన్న గొప్ప నటుడు మీరే. వారిద్దరూ ఇప్పుడు లేరు.. మీరు సినిమాలు చేస్తుండడం సంతోషాన్నిచ్చే విషయం అని వెంకయ్య చిరంజీవితో అన్నారు. 

ఊరూవాడ చూడదగిన ఉత్తమ చిత్రం సైరా నరసింహాసరెడ్డి. చాలా కాలం తర్వాత చక్కటి ప్రేరణ కలిగించే చిత్రాన్ని చూశా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. బ్రిటిష్ వారి అరాచకాలని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా చిత్రం బావుంది. 

చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సురేందర్ రెడ్డి, రాంచరణ్ లకు నా అభినందనలు అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.