కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంటిని మంగళవారం నాడు చిరు వ్యాపారులు ముట్టడించి ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయ్ సేతుపతి ఇటీవల మండి ఆన్‌లైన్‌ ప్రచార యాప్ లో నటించారు. 

ఆన్‌లైన్‌ వ్యాపారంతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ.. ఆ మండి ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటన చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి నటించడాన్ని చిరు వ్యాపార సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో విజయ్ సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళనకు దిగుతామని ఇంతకముందే హెచ్చరించారు.

ప్రభాస్ కోసం రైలు సెట్.. రూ.2 కోట్లకు పైగానే!

చెప్పినట్లుగానే మంగళవారం నాడు స్థానిక వలసరవాక్కం, అల్వార్ తిరునగర్ లోని విజయ్ సేతుపతి ఇంటిని వందలాది మంది చిరు వ్యాపారులు ముట్టడించి ఆందోళనకు దిగారు. తమిళనాడు వ్యాపార సంఘాల అద్యక్షుడు కొలత్తూర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నటుడు విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం కలిగించే ఆన్‌లైన్‌ వ్యాపారాలను ప్రోత్సహించరాదని అన్నారు. అయితే విజయ్ సేతుపతి ఇంటి ముట్టడిగురించి ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రతను ఏర్పాటు చేశారు.

ఆందోళనకారులను అరెస్ట్ చేసి సమీపంలోని ఒక కళ్యాణ మండపానికి తరలించారు. ఆన్‌లైన్‌ వ్యాపార విధానాన్ని నిషేధించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయనున్నట్లు కొలత్తూర్ రవి ఈ సందర్భంగా వెల్లడించారు.