గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

Justice for disha:'ఆడవాళ్లు సర్.. అమ్మలు సర్..' ఉత్తేజ్ కామెంట్స్!

సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ పై సినీ నటి రేణు దేశాయ్ స్పందించింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై రేణు స్పందిస్తూ.. ఎన్ కౌంటర్ పై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేవారికి ఏ మాత్రం మానవత్వం ఉందో ఆలోచించుకోవాలని అన్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నట్లు చెప్పారు. తప్పా..? ఒప్పా..? ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? అనే విషయాలను పక్కన పెడితే..జరిగింది మంచిగానే జరిగింది. నిందితులు పరిగెట్టడానికి ప్రయత్నించి వాళ్ల చావును వాళ్లే కొని తెచ్చుకున్నారని.. ఈ ఘటన చూసిన తర్వాత.. మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారని.. ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలని.. ఆ పరిస్థితులు రావాలని అన్నారు.