హైదరాబాద్: కార్తీకదీపం డైలీ సీరియల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా దీప మారిపోయింది. ఈ దీప పాత్రను పోషించిన అమ్మాయి పేరు ప్రేమి విశ్వనాథ్. ఆమెది ఛామనచాయ. దాంతో ఆమెను నల్లదీప అనే ముద్దుపేరుతో కూడా పిలుచుకుంటున్నారు. దీప అలియాస్ వంటలక్క తెలుగు మహిళల నోళ్లలో నిత్యం నానుతూ వస్తోంది. 

వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ కేరళ కుట్టి. ఆమె 1991 డిసెంబర్ 2వ తేదీన జన్మించింది. నిజానికి, కార్తీకదీపం తెలుగు సీరియల్ కు మాతృక మలయాళంలో వచ్చిన కరుతముత్తు. ఈ సీరియల్ ఆసియానెట్ చానెల్ లో ప్రసారమైంది. మలయాళంలోని సీరియల్ ను మార్పులు చేర్పులతో తీసి తెలుగులో స్టార్ మాలో ప్రసారం చేస్తున్నారు. 

తెలుగు టీవీ సీరియల్: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం

తెలుగులో 2017 అక్టోబర్ 16వ తేదీ నుంచి డైలీ సీరియల్ గా ప్రసారమవుతూ వస్తోంది. ఆమె నటుడు జయసూర్యకు బంధువు కూడా.  చామనఛాయ అయినప్పటికీ తన హావభావాల ద్వారా, కళ్ల ద్వారా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ మలయాళీలను మాత్రమే కాదు, తెలుగువాళ్లను కూడా కట్టిపడేసుకుంది.

మలయాళంలో కరుతముత్తు సీరియల్ 2014లో ప్రారంభమైంది. మలయాళంలో ప్రేమి పాత్ర పేరు కార్తీక అలియాస్ కార్తు. అదే పేరుతో ఆమె మలయాళంలో పేరు తెచ్చుకుంది. కరతముత్తు మలయాళంలో అప్పటి వరకు వచ్చిన అన్ని సీరియల్స్ ను వెనక్కి నెడుతూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 

ఆ సీరియల్ వల్ల లభించిన పాపులారిటీతో ప్రేమి విశ్వనాథ్ మరో రెండు సీరియల్స్ లో కూడా నటించింది. ప్రేమి విశ్వనాథ్ తమిళంలో రెండు సినిమాల్లో కూడా నటించింది.