కాంబినేషన్స్ తోనే సినిమాలు నిలబడుతున్నాయి. ఫలానా డైరక్టర్,ఫలానా హీరో ,ఫలానా వాళ్లని విలన్ గా చేయిస్తే ఎలా ఉంటుంది అనే కాంబినేషన్ ఆలోచనలే ఇప్పుడు పెద్ద నిర్మాతలు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా కథ,కథనాలతో ఎట్రాక్ట్ చేసే దశ దాటి కాంబినేషన్ లతో ఓపినింగ్స్ రాబట్టుకునే స్దాయికు చేరుకుంది. అందుకే నిర్మాతలంతా తమ ప్రాజెక్టులో ఏదైనా ప్రత్యేకమైన కాంబినేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని వినికిడి.

బాహుబలి చిత్రం సూపర్ సక్సెస్ తో ప్రబాస్ ..పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రం భాక్సాపీస్ వద్ద ఆ స్దాయిలో మ్యాజిక్ వర్కవుట్ కాకపోయినా నార్త్ లో ఫరవాలేదనిపించుకోవటం ఊరటే. దాంతో ప్రభాస్ తో ప్యాన్ ఇండియా సినిమా తీయాలనేది ఇప్పుడు పెద్ద నిర్మాతలందరి జీవితాశయంగా మారింది.

ఈ క్రమంలో ప్రభాస్ తో గతంలో సినిమాలు తీసి,మంచి ర్యాపో మెయింటైన్ చేసే దిల్ రాజు ఎందుకు ఆగుతారు. అందులోనూ ఆయన దగ్గర డేట్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ ని కేవలం సీన్ లోకి తెచ్చి ఏదో ఒక డైరక్టర్ తో సినిమా చేస్తే ప్యాన్ ఇండియా సినిమా స్కీమ్ వర్కవుట్ కాదు. అందుకే ఇండియా నెంబర్ వన్ డైరక్టర్స్ లో ఒకరైన శంకర్ ని సీన్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తెరపై మెరుపులు.. తెర వెనుక రోగాల బాధలు!

ప్రభాస్, శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా ట్రేడ్ మొత్తం ఎలర్ట్ అవుతుంది. తమిళంలో అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది. నార్త్ లో కూడా శంకర్, ప్రభాస్ ఇద్దరూ తెలుసు కాబట్టి అక్కడ కూడా ఓ స్దాయిలో బిజినెస్ ఉంటుంది. అయితే శంకర్ ని డీల్ చేయాలంటే బడ్జెట్ ఓ స్దాయిలో ఉంటుంది. డబ్బుని నీళ్లు లాగ పోయాలి. అందుకు దిల్ రాజు సిద్దపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు శంకర్ తో చర్చలు జరిపి కథ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

శంకర్ కూడా ప్రస్తుతం తనను భరించే నిర్మాత కోసం ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్, కమల్ ,విక్రమ్ వంటి వారితో సూపర్ హిట్స్ ఇచ్చిన ఆయన ప్రభాస్ తో సినిమా అంటే ఖచ్చిచతంగా  మాసివ్ యాక్షన్ సినిమా ఉంటుందనేది నిజం. అయితే దిల్ రాజు మిగతా ప్రాజెక్టులు ఫినిష్ చేసుకుని ఆ బడ్జెట్ ని రెడీ  చేసుకుని రంగంలోంకి దిగాలి.  అలాగే ప్రభాస్ కు సమానంగా ఎదురు నిలబడే విలన్ గా ఏ బాలీవుడ్  హీరోనో తేవాలి. అందుకోసం కసరత్తులు ప్రారంభించాలి.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా భారతీయుడు 2 జరుగుతోంది. మరో ప్రక్క ప్రభాస్ ఎప్పుడో కమిటైన జాన్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుంది. మరో ప్రక్క శంకర్ తో సినిమా చేయాలని తమిళ స్టార్ హీరో విజయ్ ఉత్సాహం చూపిస్తున్నారు.