ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా, సినీ నటుడు విజయ్‌చందర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో గురువారం నాడు విజయ్ చందర్ రాష్ట్ర చలనచిత్ర , టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యత స్వీకరించారు.

మేళతాళాల నడుమ ఆయనకి స్వాగతం చెబుతూ బాధ్యతలు అప్పగించారు. అనంతరం విజయ్ చందర్ కొన్ని కామెంట్స్ చేశారు. స్వతంత్రం రాకముందు నుండి జెండా పట్టుకొని తిరిగానని.. తను రాజశేఖరరెడ్డి అభిమానిని చెప్పుకొచ్చారు. రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు చలన చిత్ర పరిశ్రమకు చైర్మన్ గా చేయమని అడిగినట్లు గుర్తుచేసుకున్నవిజయ్ చందర్.. తన కల  ఈనాటికి నెరవేరిందని.. జగన్ తన కల నెరవేర్చారని అన్నారు. 

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా విజయ్ చందర్ నియామకం

ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రం  మోసపోయిందని, ఇకనుంచి  ప్రతిభ , టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇస్తానని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా సినీ పరిశ్రమ పని చేస్తుందని తెలిపారు. 

వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయం నుండి సినీ నటుటు విజయ్ చందర్ ఆయనతో పాటు ఉన్నాడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడ విజయ్ చందర్ వైసీపీ తరపున ప్రచారం నిర్వహించాడు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడ ఆయనతో పాటే పాల్గొన్నాడు.

సినీ నటుడు పృథ్వీకి ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. సినీ రంగానికి చెందిన విజయ్ చందర్ కు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ పదవిని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గా అంబికా కృష్ణ కొనసాగాడు.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు.ఈ పదవి కోసం సినీ రంగంలో పలువురి పేర్లను  తెరమీదికి వచ్చాయి. కానీ, చివరకు పదవి మాత్రం విజయ్ చందర్ ను వరించింది. ఈ పదవి విషయంలో సినీ నటుడు అలీ పేరు కూడ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.