ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా, సినీ నటుడు  విజయ్‌చందర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయం నుండి సినీ నటుటు విజయ్ చందర్ ఆయనతో పాటు ఉన్నాడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడ విజయ్ చందర్ వైసీపీ తరపున ప్రచారం నిర్వహించాడు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడ ఆయనతో పాటే పాల్గొన్నాడు.

సినీ నటుడు పృథ్వీకి ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. సినీ రంగానికి చెందిన విజయ్ చందర్ కు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ పదవిని ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గా అంబికా కృష్ణ కొనసాగాడు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు.

పార్టీ ఆవిర్భావం నుండి తనతో ఉన్న వారికి ఏపీ సీఎం జగన్  పదవులను కట్టబెడుతున్నారు. కేబినెట్ కూర్పులో కూడ కష్టకాలంలో పార్టీ ఉన్న సమయంలో తనతో ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారు.అదే విధంగా నామినేటేడ్ పదవుల ఎంపికలో కూడ అదే రకమైన పద్దతిని జగన్ అవలంభించాడు. 

ఈ పదవి కోసం సినీ రంగంలో పలువురి పేర్లను  తెరమీదికి వచ్చాయి. కానీ, చివరకు పదవి మాత్రం విజయ్ చందర్ ను వరించింది. ఈ పదవి విషయంలో సినీ నటుడు అలీ పేరు కూడ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

ఎన్నికల ముందే అలీ వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా నుండి అలీ టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేసేందుకు ప్రయత్నించారు.కానీ, చివరకు వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. 

సీనియర్ నటుడు మోహన్ బాబు, కమెడియన్ అలీ, రాజశేఖర్ దంపతులు, జయసుధ ఎన్నికలకు ముందు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. 

ఏపీ సీఎం జగన్  సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ కూడ రాకపోవడంపై పృథ్వీ పలు సమయాల్లో తీవ్రంగా విమర్శించారు. సైరా సినిమా చూడాలని కోరుతూ గత నెలలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడ జగన్ సతీమణి భారతిని కూడ గత మాసంలోనే కలిశారు.