బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్లుగా ఇర్ఫాన్ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. న్యూరో ఎండ్రోకిన్ ట్యూమర్ అనే వ్యాధితో ఇర్ఫాన్ ఖాన్ దాదాపు రెండేళ్లు పోరాటం చేశారు. ఇటీవల ఇర్ఫాన్ ఖాన్ కొలోన్ ఇన్ఫెక్షన్ కు గురికావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి ఆసుపత్రిలో చేర్పించారు. 

చికిత్స పొందుతూ ఇర్ఫాన్ ఖాన్ బుధవారం తుదిశ్వాస విడిచారు. 54 ఏళ్ల వయసులోనే ఈ దిగ్గజ నటుడు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖులు, ఇతర భాషలకు చెందిన నటులు ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

నా భార్య కోసం బతుకుతా.. కొన్ని రోజుల క్రితం ఇర్ఫాన్ కామెంట్స్.. ఇంతలోనే

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ఇర్ఫాన్ ఖాన్ గారి ఆకస్మిక మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఓకే అద్భుతమైన నటుడిని చాలా త్వరగా కోల్పోయాం. ఇర్ఫాన్ ఖాన్ లేని లోటు భర్తీ చేయలేనిది. ఇర్ఫాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని మహేష్ ట్వీట్ చేశారు. 

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇర్ఫాన్ ఖాన్ మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ప్రపంచ సినిమా ఒక ఆభరణం లాంటి నటుడిని కోల్పోయింది. ఇండియన్ సినిమా ఒక అసాధారణమైన నటుడిని కోల్పోయింది. మనం ఒక లెజెండ్ ని మిస్ అయ్యాం. ఇర్ఫాన్ ఖాన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. 

ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఏకైక తెలుగు చిత్రం 'సైనికుడు'. మహేష్ బాబుతో కలసి కీలక పాత్రలో ఇర్ఫాన్ ఆ చిత్రంలో నటించారు. సైనికుడు ఫలితం నిరాశపరిచినప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక ఇర్ఫాన్ పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.