ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణం దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. కొద్ది సేపటి క్రితమే ఇర్ఫాన్ ఖాన్ ముంబైలో చికిత్స పొందుతూ మరణించారు. ఇర్ఫాన్ ఖాన్ 1988లో సలాం బాంబే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇర్ఫాన్ ఖాన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దూసుకుపోయారు. 

చాలా ఉత్సాహభరితంగా ఇర్ఫాన్ ఖాన్ సినిమాల్లో నటించారు. కానీ గత రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది. 2018లో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కు గురయ్యారు. ఓపక్క క్యాన్సర్ తో బాధపడుతూనే కొన్ని సినిమాల్లో కూడా నటించారు. క్యాన్సర్ కు గురయ్యాక ఇర్ఫాన్ ఖాన్ చికిత్స కోసం లండన్ లో వెళ్లారు. ఇర్ఫాన్ ఖాన్ కు సోకిన క్యాన్సర్ పేరు న్యూరో ఎండ్రోకిన్ ట్యూమర్. 

ఈ ట్యూమర్ క్రమంగా పెరుగుతూ శరీర ఇతర భాగాలకు కూడా వ్యాప్తిస్తుంది. లండన్ లో చికిత్స తర్వాత ఇర్ఫాన్ కోలుకున్నట్లే కనిపించారు. అంగ్రేజీ మీడియం చిత్ర షూటింగ్ కోసం ఇర్ఫాన్ ఖాన్ ఇండియాకు ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. షూటింగ్ పూర్తి చేసికుని తిరిగి చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. 

గత ఏడాది సెప్టెంబర్ లో ఇర్ఫాన్ ఖాన్ తిరిగి ఇండియాకు వచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ కాస్త కోలుకున్నారు అని భావిస్తున్న తరుణంలో అతడి అనారోగ్యం మళ్ళీ తిరగబెట్టింది. గత నెల మార్చిలో ఇర్ఫాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తానూ అనారోగ్యంతో పోరాడుతున్నాను అంటే, ఇప్పటి వరకు జీవించి ఉన్నాను అంటే అందుకు కారణం తన భార్యే అని తెలిపాడు. 

ఇర్ఫాన్ ఖాన్ భార్య పేరు సుతాప సిఖ్దర్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన భార్య తన కోసం ఎంతో తపన పడిందని ఇర్ఫాన్ తెలిపాడు. ఇక కుమారులు కూడా ఎంతో మద్దతు నిచినట్లు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. 

బ్రేకింగ్: బాలీవుడ్ లెజెండ్రీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి.. తల్లి మరణించిన కొద్ది రోజులకే..

తన భార్య, కుటుంబం కోసం అయినా తాను బతుకుతానని ఇర్ఫాన్ మీడియాతో అన్నారు.  కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఇర్ఫాన్ ఆరోగ్యం విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇర్ఫాన్ ఖాన్ బుధవారం మృతి చెందారు.