బయట బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. మహానటి సావిత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర సినిమాలు తెరపైకి వచ్చాయి.వీటి సక్సెస్ శాతం కూడా ఎక్కువే ఉంది. దాంతో ఇంకా ఎవరి బయోపిక్ చేస్తే క్రేజ్ ఉంటుందనే విషయమై దర్శక,నిర్మాతలు తెగ ఆలోచనలు చేస్తున్నారు. కొందరు స్క్రిప్టులు రెడీ చేస్తూంటే, మరికొందరు ఆల్రెడీ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనిలో ఉంటున్నారు.

ముఖ్యంగా రాజకీయనాయకులు, సినిమావాళ్ల బయోపిక్ లలో కాస్తంత కిక్ ఉంటుందని అటు వైపు మొగ్గుతున్నారు. ఈ నేపధ్యంలో ల‌వ‌ర్‌బాయ్‌గా అందరి మ‌న‌సులు దోచుకున్న దివంగత  హీరో ఉద‌య్ కిర‌ణ్ బయోపిక్ మూవీగా తీసేందుకు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ సిద్దమవుతున్నాడనే వార్త మీడియాలో హల్ చల్ చేసింది. ఆ బయోపిక్ లో హీరోగా సందీప్ కిషన్ చేయబోతున్నారంటూ కొందరు నెక్ట్స్ లెవిల్ కు వెళ్లి వార్త వండేసారు. నిన్న సినిమా మొత్తం ఈ వార్త చుట్టూ తిరిగింది. కొన్ని టీవి ఛానెల్స్ ఈ విషయమై ఉదయ్ కిరణ్ ని చూపెడుతూ కాలక్షేపం చేసారు.

వీళ్లు వదలుకున్న క్యారెక్టర్స్ తో.. వాళ్లకి క్రేజ్ వచ్చింది!

ఆ వార్తలు ప్రకారం ఓ ఫిల్మ్ మేకర్.. తాను రాసుకున్న కథను హీరో సందీప్ కిషన్ కు ఇటీవల వినిపించాడు.. కథ నచ్చడంతో తప్పకుండా చేద్దామని సందీప్ హామీ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్.  ఇందులో ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో వ‌చ్చిన‌ ఒడిదుడుకులు, జ‌యాప‌జ‌యాలతో పాటు ఉద‌య్ కిర‌ణ్ ప‌డిన‌ ఇబ్బందులు, మాన‌సిక డిప్రెష‌న్స్ త‌దిత‌ర అంశాలు సినిమాలో చూపించ‌నున్నాడ‌ట‌.  ఆత్మహత్య చేసుకోబోయే చివ‌రి రోజుల‌లో ఉద‌య్ మాన‌సికంగా ఎలాంటి బాధ అనుభ‌వించాడు అనే అంశాలు కూడా సినిమాలో చూపించ‌నున్నాడ‌ట‌. అయితే అవన్నీ అబద్దం అని తేలింది. ఈ విషయమైమ సందీప్ కిషన్ అఫీషియల్ గా ప్రకటన చేసారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నేను నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై చాలా మంది నన్ను అడుగుతున్నారు. మీడియా వారికి, నా అభిమానులుకు ఈ మ్యాటర్ పై క్లారిటీ ఇవ్వదలిచాను. ఈ బయోపిక్ విషయమై నన్ను ఇప్పటిదాకా ఎవరూ ఎప్రోచ్ కాలేదు. అంతేకాదు నాకు బయోపిక్ లలో నటించాలనే ఇంటెన్షన్ ప్రస్తుతానికి అయితే లేదు అని తేల్చి చెప్పారు

ఉదయ్ కిరణ్ విషయానికి వస్తే.. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వరుస సినిమాలతో హిట్టు కొట్టి లవర్ బోయ్ గా, స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ క్రేజ్ అతన్ని ఓ స్దాయిలో చిరంజీవి కుమార్తెతో నిశ్చితార్దం స్దాయికి తీసుకెళ్లింది. అయితే పరిస్దితి తారుమారు అయ్యాయి.  ఆ తర్వాత  ఉదయ్ కిరణ్ చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఈ నేపద్యంలో ఉదయ్ 2014 జనవరి 5 న తన నివాసంలో సూసైడ్  చేసుకున్నారు.