మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తరువాత అతడితో సినిమాలు తీయాలని చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే చిరు మాత్రం తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీఎంట్రీ తరువాత ఆయన నటించిన రెండు సినిమాలు కూడా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం చిరు.. దర్శకుడు కొరటాలతో ఓ సినిమా చేస్తున్నారు.

దీన్ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. త్రివిక్రమ్ లాంటి దర్శకులు చిరుతో సినిమా తీయలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా చేరాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి తన రెండో సినిమా బాలీవుడ్ లో చేశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ నే 'కబీర్ సింగ్' గా హిందీలో తీశాడు. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. 

ఇప్పుడు ఈ డైరెక్టర్ రణబీర్ కపూర్ తో సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ డైరెక్టర్ హైదరాబాద్ కి తిరిగొచ్చాడు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన ఆఫీస్ కి వెళ్లాడు. అక్కడ కొంతమంది జర్నలిస్ట్ లతో ముచ్చటించారు. ఈ క్రమంలో అతడు కొన్ని విషయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సందీప్ రెడ్డి.. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు.

కొరటాల - రాక్ స్టార్: మెగాస్టార్ కోసం విడిపోక తప్పట్లేదు?

ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు కానీ అది సెట్ కాలేదు. ఇప్పుడు తనకు మెగాస్టార్ తో సినిమా చేయాలనుందని సందీప్ మీడియా ఫ్రెండ్స్ తో చెప్పడం విశేషం. మెగాస్టార్ కి కథ చెప్పాలనుందని అన్నాడు. మెగాస్టార్ వయసుకి, స్టార్ డమ్ కి తగ్గ కథ తన వద్ద ఉందని.. ఆయన సినిమా ఒప్పుకున్నా.. లేకపోయినా కథ అయితే చెప్పాలనుందని తన కోరికను బయటపెట్టాడు. చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే ఎంతో అభిమానమని అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటానని అంటున్నారు. మరి చిరు.. సందీప్ రెడ్డితో సినిమా చేస్తాడో లేదో చూడాలి!