చిన్న సినిమాగా విడుదలై అర్జున్ రెడ్డి చిత్రం సంచలనాలు సృష్టించింది. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ఎన్ని వివాదాలు ఎదురైనా యువత నుంచి మంచి ఆదరణ లభించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించారు. 

ఈ చిత్రం సాధించిన సక్సెస్ చూసి ఇతర భాషల నిర్మాతలు, దర్శకులు ఆశ్చర్యపోయారు. ఫలితంగా ఈ చిత్ర రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. హిందీ రీమేక్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. అక్కడ కూడా అర్జున్ రెడ్డి చిత్రం తిరుగులేని సక్సెస్ అందుకుంది. దాదాపు 200 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. 

చిత్రంలోని కథపై ఫిలిం క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. కానీ మద్యానికి బానిసైన డాక్టర్ పాత్రలో షాహిద్ నటన అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. దీనితో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కు అవార్డులు వస్తాయని అంతా భావించారు. 

ఇటీవల బాలీవుడ్ చిత్రాలకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో ఈ వేడుక బుల్లితెరపై ప్రసారం కాబోతోంది. కానీ ఈ అవార్డుల ఫంక్షన్ లో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. షాహిద్ కపూర్ తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. ఈ వేడుకలో తనకు కబీర్ సింగ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని షాహిద్ కట్టి నమ్మకంతో ఉన్నాడట. 

దీనితో ఈవెంట్ లో డాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. కానీ తుది జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గల్లీ బాయ్ చిత్రానికి గాను రణ్వీర్ సింగ్ ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. దీనితో షాహిద్ కపూర్ డాన్స్ ఫెర్ఫామెన్స్ ఇవ్వకుండానే వేడుక నుంచి అలిగి వెళ్ళిపోయాడట. 

రాఘవేంద్ర రావుని ఓదార్చిన రానా.. ఎమోషనల్ అయిన వెంకటేష్, సురేష్ బాబు!

ఇక చేసేది లేక నిర్వాహకులు అప్పటికప్పుడు వరుణ్ ధావన్ తో డాన్స్ పెర్ఫామెన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ సన్నిహితులు మాత్రం ఈ ఖండిస్తున్నారు. షాహిద్ అనారోగ్యం కారణంగానే ఈవెంట్ నుంచి బయటకు వచ్చేశారని అంటున్నారు. మొత్తంగా సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రానికి హిందీలో ఈ విధంగా ఝలక్ ఎదురైంది.