బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదిగా రియా చక్రవర్తి చర్యలు తన కుమారుడి మరణానికి దారి తీశాయని.. ఇందుకు తగిన ఆధారాలున్నాయని సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్పష్టం చేశారు.

కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లినందున, తనపై పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలంటూ రియా సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిపై కేకే సింగ్ స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్ యొక్క అధికార పరిధి అన్న ప్రశ్న విచారణ దశలో వస్తుందని.. కేసు దర్యాప్తు సాగుతున్నప్పుడు కాదని వివరించారు.

Also Read:ఈడీకి రియా షాక్‌.. ఆస్తులడిగితే లెటర్‌ ముందు పెట్టింది!

తన కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని సింగ్ ఆరోపించారు. అక్కడి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు త్వరపడలేదని ఆయన ముంబై పోలీస్ విభాగంపై విమర్శలు గుప్పించారు.

కాగా సుశాంత్ కేసులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 11న మరోసారి విచారించనుంది. సుశాంత్ మరణానికి ముందు బీహార్‌లో నివసిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని ముంబై పోలీసులు తెలిపారు.

Also Read:నోరు విప్పిన రియా.. సుశాంత్ డబ్బు వాడుకోవటంపై క్లారిటీ

తన కుమారుడి ఖాతా నుంచి రియా రూ.,15 కోట్లను అక్రమంగా బదిలీ చేసినట్లు సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు సుశాంత్ , రియా చక్రవర్తితో కలిసి రెండు కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటిలో రియాతో పాటు ఆమె సోదరుడు కూడా డైరెక్టర్లుగా వున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

రెండు సంస్థల రిజిస్టర్డ్ చిరునామాలు మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఉల్వే పట్టణంలోని ఓ ఫ్లాట్‌దని చెప్పారు. ఇది రియా చక్రవర్తి తండ్రిదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువ హీరోగా దూసుకెళ్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబై బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.