సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కథలను తీసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు వర్మ. 

రేపే ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా వర్మ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఎనభైల కాలానికి చెందిన హైదరాబాద్ దాదాస్ మీద సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు.

థ్రిల్లయ్యా.. 'జార్జిరెడ్డి'పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై సినిమాలను చేసిన తను ఇప్పుడు 80 ద‌శ‌కంలోని దాదాలపై సినిమా చేస్తానని వెల్లడించాడు. నా `శివ` సినిమాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన ఓ నిజ జీవిత పాత్ర‌ను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలిపాడు.

ఈ సినిమాలో నటుడు సందీప్ మాధవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గతంలో వర్మ.. సందీప్ తో కలిసి 'వంగవీటి' అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా సందీప్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం సందీప్ 'జార్జి రెడ్డి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. 

పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా వర్మ 'జార్జి రెడ్డి' క్రేజ్ ని వాడుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ తో సినిమా ఓకే చేసుకున్నాడు. మరి చెప్పినట్లుగా.. వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తారా..? లేక ప్రకటనలకే పరిమితం చేస్తారో చూడాలి!