అప్పటివరకు ఒలివియా మోరిస్ అంటే ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అలాంటిది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన 'RRR' సినిమాలో హీరోయిన్ అనేసరికి ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది.

బ్రిటన్ కి చెందిన ఈమె థియేటర్ ఆర్టిస్ట్. అయితే ఎక్కడా సినిమాలు కానీ, వెబ్ సిరీస్ లు కానీ చేయని ఈ అమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పేరు లేదు. ఆమె వివరాలు తెలుసుకుందామంటే.. కనీసం వికీపీడియా పేజ్ కూడా లేదు. అలాంటి అమ్మాయిని తారక్ పక్కన హీరోయిన్ గా పెట్టారంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు ముందే కాసుల వర్షం కురిపించిన సినిమాలు

ఎన్టీఆర్ రేంజ్ తగ్గించడానికి కావాలని ఆమెని తీసుకున్నారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తన సినిమాలో ఏ పాత్రకు ఎవరు సరిపోతారనే విషయంలో రాజమౌళి చాలా  జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒలివియాని కూడా తను కావాలనే సినిమాలో  తీసుకున్నాడని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలో ఒలివియా పాత్ర మరీ ఎక్కువ సేపు ఉండదట.

మహా అయితే 20 నిమిషాల పాటు ఆమె తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. కొమరం భీమ్ ని ఇష్టపడే బ్రిటీష్ అమ్మాయిగా కనిపించే పాత్రకి నృత్యం తెలిసి ఉండాలట. ఒలివియా మంచి డాన్సర్ కావడం, ఆమె చేసిన నాటకాల్లో నటన కూడా రాజమౌళిని ఆకట్టుకోవడం, పాత్రకు పక్కాగా సరిపోతుందని అనిపించడంనే ఆమెని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్టిస్ట్ ల నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మన్స్ రాబట్టుకొని చిన్న పాత్రల్ని కూడా తనదైన శైలిలో ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన రాజమౌళి.. అన్నివిధాల ఆలోచించే ఒలివియాని రంగంలోకి దింపాడు. మొన్నటిదాకా ఒలివియా ఎవరో తెలియకపోవచ్చు కానీ 'RRR'లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా అనౌన్స్ చేసిన తరువాత ఆమెకి కావలసినంత పాపులారిటీ వచ్చింది.