క్రైమ్ నేపథ్యంలో వచ్చే సైకో థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటిస్తున్న తాజా చిత్రం 'మర్దానీ 2'. గోపి పుత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన అమ్మాయిలపై అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి ఉద్యోగ శిక్షణ కోసం ప్రతి ఏటా వేలాదిమంది అమ్మాయిలు వస్తుంటారు. వారిపై కన్నేసిన ఓ సైకో అత్యాచారం చేసి హత్య చేస్తుంటాడు. వాడి అంతు చూడడానికి పోలీస్ అధికారి శివానీగా రాణి ముఖర్జీ రంగంలోకి దిగుతుంది. 

ఆ సైకోని చివరకు ఎలా తుదముట్టించింది అనేది ఈ చిత్ర కథ. ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 

తండ్రయిన స్టార్ కమెడియన్.. సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ!

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో జరిగింది. ఈ చిత్రంలోని సందేశం దేశం మొత్తం ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉందని, అందుకే సౌత్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

రాణి ముఖర్జీ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తోంది.