కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర షో దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సెలెబ్రిటీలు, సౌత్ ఇండియా సినీ సెలబ్రటీలతో పాటు క్రీడా ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. 

కపిల్ శర్మ సెలెబ్రిటీలతో చేసే సందడి, కామెడీ పంచ్ లు ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాయి. అందుకే సల్మాన్ ఖాన్ నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరి ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ షోతో కపిల్ శర్మ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

తాజాగా తాను తండ్రి అయినట్లు కపిల్ శర్మ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించాడు. తన సంతోషాన్ని తెలియజేస్తూ.. 'అమ్మాయి పుట్టింది.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. లవ్ యు ఆల్' అని ట్వీట్ చేశాడు. దీనితో కపిల్ శర్మ, గిన్ని చత్రాత్ దంపతులకు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కపిల్ శర్మ, గిన్ని చత్రాత్ గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి ముందే వీరిద్దరూ స్నేహితులు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో గత ఏడాది డిసెంబర్ 12న వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. 

ప్రస్తుతం కపిల్ శర్మ తండ్రి కావడంతో సంతోషంలో మునిగితేలుతున్నాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. సినీ క్రీడా ప్రముఖులు కపిల్ శర్మ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ, సురేష్ రైనా, సైనా నెహ్వాల్, దియా మీర్జా లాంటి ప్రముఖులంతా కపిల్ శర్మకు బెస్ట్ విషెష్ తెలియజేశారు.