వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో హాట్ టాపిక్ పై చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్ని వివాదాలు ఎదురైనా తాను ఎంచుకున్న అంశంపై సినిమా తెరకెక్కించి తీరుతానని వర్మ గతంలో నిరూపించుకున్నారు. త్వరలో తాను హైదరాబాద్ లో జరిగిన ఘోరం దిశ సంఘటనపై సినిమా తెరకెక్కించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 

ప్రకటించడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబంధించిన వర్క్ కూడా మొదలుపెట్టేశారు. స్క్రిప్ట్ ని రూపొందించేందుకు దిశా కేసులో వివరాలపై వర్మ లోతుగా అధ్యయనం చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే నలుగురు దోషులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకని వర్మ కలసిన సంగతి తెలిసిందే. 

ఆమెని అడిగి చెన్నకేశవులు గురించి వర్మ అడిగి తెలుసుకున్నారు. తాజాగా వర్మ శంషాబాద్ ఏసీపీని కలిశారు. పోలీసులు వారిని అడిగి దిశా కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దిశాపై తెరకెక్కించబోయే చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

దిశా కేసు అనేది జాతీయవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి సంఘటనపై సినిమా తీయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఎమోషనల్ గా దిశా చిత్రాన్ని తెరకెక్కిస్తాను. ఒక దర్శకుడిగా ఈ సమాజంలో జరిగిన సంఘటన గురించి సినిమా తీసే హక్కు నాకు ఉంది అని వర్మ మీడియాతో పేర్కొన్నారు. 

వర్మ ఇప్పటికే ఎన్నో బయోపిక్ చిత్రాలని తెరక్కించారు. 26/11 ముంబై దాడులపై కూడా సినిమా రూపొందించారు. ప్రస్తుతం వర్మ తెరకెక్కించబోయే దిశా చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

దిశ కేసు: హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇదా!