మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్రెండ్షిప్ గోల్స్ సెట్ చేస్తుంటారు. ఒకరి కుటుంబంతో మరొకరిని సత్సంబంధాలు కూడా ఉన్నాయి.

టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలైన వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 'RRR' అనేది వర్కింగ్ టైటిల్. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

RRR : ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కంటెంట్, ఖర్చు!

ఈ సినిమాకి కలిసి పని చేస్తుండడంతో చరణ్, ఎన్టీఆర్ లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ తో కలిసి పని చేయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పిన చరణ్.. షూటింగ్ లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుందని.. ఒకవేళ తారక్ షూటింగ్ లో లేకపోతే అతడిని మిస్ అవుతానని అంటున్నారు.

ఎన్టీఆర్ తనకు చాలా కాలంగా మంచి స్నేహితుడు కావడంతో చాలా సులభంగా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.