తనకి తీవ్ర గాయా లయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఖండించారు.  డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్‌ వెళ్లారు. ఈ షోతో  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రిటన్‌ సాహసికుడు బేర్‌గ్రిల్స్‌ రజనీకాంత్‌తో కలసి సాహసం చేయడానికి రెడీ అయ్యారు.  మంగళవారం మద్దూరు పరిధిలోని అటవీప్రాంతం చమ్మనహళ్లలో చిత్రీకరణ చేస్తుండగా రజనీకి చాలా స్వల్పగాయం అయింది. అయితే మీడియాలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని వార్తలు రావటంతో స్పందించారు. తన అభిమానులు కంగారుపడవద్దని సూచించారు.

రజనీ మాట్లాడుతూ..  “నేను  ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్నాను. నేను ఏ విధంగానూ గాయపడలేదు. ముళ్ల వలన చర్మం కాస్త గీరుకుపోయిందంతే. అంతకు మించి ఏమీ జరగలేదు. నేను బాగానే ఉన్నాను,” అంటూ రజనీ చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ వివరించారు.

టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ చేతుల్లో వందల కోట్లు.. వివరాలు ఇవే! 

మైసూరు జిల్లా గుండ్లుపేట తాలూకా బండీపుర అభయారణ్యంలో పులుల సంరక్షణ ప్రదేశంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరగింది. ఈ షూట్ లో పాల్గొనడానికి రజనీ సోమవారమే బండీపురకు చేరుకోగా బేర్‌ గ్రిల్స్‌ మంగళవారం ఉదయం వెళ్లారు.మనుషులు, వన్యజీవుల మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించేందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

బుధవారం నటుడు అక్షయ్‌కుమార్‌ బేర్‌ గ్రిల్స్‌తో కలసి షూటింగ్‌లో పాల్గొననున్నారు. గత ఏడాది బేర్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ అడవుల్లో డాక్యుమెంటరీలో పాల్గొన్న సంగతి తెలిసిందే.